తెలంగాణాలో ప్రసిద్ధి చెందిన వంటకం--సర్వ పిండి

తెలంగాణాలో ప్రసిద్ధి చెందిన వంటకం--సర్వ పిండి



మాములుగానే సర్వ పిండి మస్త్ రుచి గా ఉంటుంది... బయట వాన పడుతుంటే ఇంట్లో వేడి వేడి సర్వ పిండి తింటుంటే ఆ మజా యే వేరుగా ఉంటుంది.

ప్రస్తుతం పలు చోట్ల వర్షం పడుతుంది కావున సర్వ పిండి తయారు చేసే విధానం ఇక్కడ తెలుసుకొని.. చేసుకుని.. ఎంజాయ్ చేద్దాం!

నువ్వులను వేయించి పెట్టుకోవాలి. పల్లీలు వేయించి పొట్టు తీసి రెండు ముక్కలుగా నలిపి నీళ్లలో నానబెట్టుకోవాలి. అలాగే సెనగపప్పు కూడా నీళ్ళలో నానబెట్టాలి. ఒక గిన్నెలో బియ్యం పిండి వేసుకుని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమిర, కారంపొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, నువ్వులు, జీలకర్ర, నానబెట్టిన సెనగపప్పు, పల్లీలు, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి అవసరమైనన్ని గోరువెచ్చని నీళ్లు చల్లుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. మందపాటి గిన్నె లేదా నాన్‌స్టిక్ పాన్ తీసుకుని దానిలోపలంతా పలుచగా నూనె రాయాలి. తడిపి ఉంచుకున్న పిండి మరోసారి మర్ధనా చేసుకుని కొంచం పెద్ద ఉండ చేసుకోవాలి. నూనె రాసిన పాన్ లో ముద్ద పెట్టి నూనె రాసిన చేతివేళ్లతో వెడల్పుగా చపాతీలా వత్తుకోవాలి. మరీ పలుచగా కాకుండా, మరీ మందంగా కాకుండా వత్తుకోవాలి. తర్వాత చూపుడువేలితో అక్కడక్కడా రంధ్రాలు చేయాలి. ఈ రంధ్రాలలో, చుట్టూతా కొద్దిగా నూనె వేసి మంట మీద పెట్టాలి. మూతపెట్టి నిదానంగా ఐదు నిమిషాలు ఉడికించాలి. మూత తీసి మరో ఐదు నిమిషాలు కాల్చుకోవాలి. కావాలంటే మరి కొంచం నూనె వేసి రొట్టెను రెండోవైపున కూడా కాల్చుకోవచ్చు. ఈ రొట్టెలు తెలంగాణా లో ఎక్కువగా చేసుకుంటారు. ఇవి ఒకరోజు నిలవ ఉంటాయి.

కావలసిన పదార్థాలు: బియ్యం పిండి – 2 కప్పులు, నువ్వులు – 3 చెంచాలు, పల్లీలు – 2 చెంచాలు, సెనగపప్పు – 2 చెంచా లు, పచ్చిమిర్చి – 5, జీలకర్ర – 1/2 చెంచా, కారం పొడి – 1 లేదా సగం చెంచా, అల్లం వెల్లుల్లి ముద్ద – 1 చెంచా, ఉల్లిపాయ తరుగు – 1/4 కప్పు, కొత్తిమిర – 1/4 కప్పు, కరివేపాకు – 3 రెమ్మలు, ఉప్పు – తగినంత, నూనె – 1/4 కప్పు....

ఈ విషయం మరికొందరికి చెప్పడానికి ఈ పోస్ట్ ని Share చెయ్యండి

No comments:

Post a Comment