Sri Kodanda RamaSwamy Temple,Ontimitta,Kadapa


Sri Kodanda RamaSwamy Temple,Ontimitta,Kadapa

Sri Kodanda RamaSwamy Temple,Ontimitta,Kadapa

శ్రీరాఘవం దాశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం!
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి!!

అంటూ శ్రీరామ నామ స్మరణతో మారుమ్రోగుతున్న దివ్య క్షేత్రం ఒంటిమిట్ట. ఏకశిలానగరంగా రాష్ట్రంలో ఉన్న శ్రీరాముని పురాతన ఆలయాలలో ఒకటిగా దేశంలో ఉన్న శ్రీరాముని ఆలయాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న ఈదివ్య క్షేత్రంలో సాక్షాత్తూ కోదండరామ స్వామి వారు సీతాలక్ష్మణ సహితంగా కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. ఈ ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. అత్యంత పురాతనమైన ఈ దివ్యాలయానికి 11వ శతాబ్దం నాటి చోళరాజులు, విద్యానగర రాజులు, మట్టి రాజులు ఈ ఆలయానికి అనేక మాన్యాలు ఇచ్చినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఒంటిమిట్టకు చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడ సమీపంలోని రామతీర్థానికి చేరుకొని స్నానాదికాలు చేస్తారు. అత్యంత మహిమాన్వితమైన ఈ రామతీర్థాన్ని స్వయంగా శ్రీరామచంద్రుడు తన బాణంతో ఏర్పాటు చేశాడని చెప్తారు. ప్రశాంతమైన వాతావరణంలో మనోహరమైన ప్రకృతి అందాలను ఆవిష్కరించే ఈ రామతీర్థంలో స్నానమాచరించే భక్తుల ఈతిబాధలన్నీ మటుమాయం అవుతాయని చెప్తారు. ఈ రామతీర్థంలో లక్ష్మణ తీర్థం కూడా భక్తులకు దర్శనమిస్తుంది. రామలక్ష్మణ తీర్థాలను ఆనుకొని బమ్మెర పోతనామాత్యునికి చెందినవిగా చెప్పబడుతున్న పంటపొలాలు దర్శనమిస్తాయి. సుప్రసిద్ధ కవిపండితులు బమ్మెర పోతనామాత్యులు ఈక్షేత్రంలోనే భాగవత రచన చేసి ఇక్కడ కొలువైన కోదండ రామునికి అంకితమిచ్చినట్లు పురాణాల ద్వారా అవగతమౌతోంది.

అతి పురాతనమైన ఈ ఆలయాన్ని మూడు దఫాలుగా నిర్మించినట్లు శాసనాలద్వారా అవగతమౌతోంది. చోళరాజులు, విద్యానగర రాజులు, మట్టి రాజుల పరిపాలనలో ఈ ఆలయం అంచెలంచెలుగా అభివృద్ధి చెందినట్లు తెలుస్తోంది. విద్యారణ్య ప్రభువులు, సదాశివ రాయలు, చోళ రాజులు ఈ ఆలయానికి అనేక మాన్యాలు ఇచ్చినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. అతి పురాతనమైన ఈ దివ్యాలయం విశాలమైన ప్రాంగణంలో దర్శనమిస్తుంది. మనోహరమైన శిల్ప రాజాలను దర్శింపజేస్తుంది. ఈ ఆలయ ప్రాకారం, గోపురాలపై చోళుల నాటి శిల్పకళా వైభవాన్ని భక్తులు తనివితీరా దర్శించుకుంటారు. విశాలంగా, ప్రశాంతంగా ఉన్న ప్రధాన ఆలయ ప్రాంగణంలో స్వామివారి గర్భాలయానికి ముందు భాగంలో ఆ కాలంనాటి ధ్వజస్తంభం ఒకటి దర్శనమిస్తుంది. దీని దర్శనభాగ్యం చేతనే సమస్త భాగ్యాలూ సొంతమౌతాయని భక్తులు విశ్వసిస్తూ ధ్వజస్తంభాన్ని భక్తితో పూజిస్తారు. అనంతరం ముఖమండపంలోకి ప్రవేశిస్తారు.

ఈ క్షేత్రానికి సంబంధించి ఓ జానపద గాథ ప్రచారంలో ఉంది. పూర్వం ఒండుడు, మిట్టుడు అనే ఇద్దరు సోదరులైన దొంగలు ఈ పరిసర గ్రామంలో దోపిడీ చేసేవారట. వారు దొంగిలించిన వస్తువులను ఈక్షేత్రంలో ఉన్న గుహలలో దాచేసేవారట. అప్పుడు ఈ గుహలో శిలపై ఉన్న సీతారామ లక్ష్మణులు ఆ దొంగలకు హితోపదేశం చేసి నిజాయితీగా బ్రతకమని ఆదేశించారట. దాంతో మనస్సు మార్చుకున్న ఆ దొంగలు ఆ విగ్రహాలకు గర్భగుడి, అంతరాలయం నిర్మించారట. ఆకారణంగా ఈ క్షేత్రానికి ఒంటిమిట్ట అని పేరు వచ్చినట్లు తెలుస్తోంది.

ఆలయ ముఖ మండపం భక్తులను మైమరిపిస్తుంది. మనోహరమైన శిల్పరాజాలతో కూడిన స్తంభాలు, ప్రాకారాలు, కుడ్యాలు ఈ ముఖమండపంలో భక్తులకు దర్శనమిస్తాయి. ఆయా ప్రాకారాలు స్తంభాలపై రామాయణ మహాభారత గాథలు, దశావతార ఘట్టాలకు చెందిన మనోహరమైన శిల్పరాజాలెన్నో భక్తులకు దర్శనమిచ్చి మైమరపిస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు ఆలయానికి ముందు కుడివైపునున్న పోతనామాత్యుని మందిరానికి చేరుకొని ఆయనను భక్తితో దర్శించుకుంటారు. బమ్మెర పోతన ఈ క్షేత్రంలోనే మహాభాగవత రచన చేస్తూ గజేంద్రమోక్షంలో “అల వైకుంఠపురంబులో” అనే పద్యంలోని కొన్ని చరణాలు గుర్తుకు రాక నిలిపివేయగా శ్రీరామచంద్రుడు వచ్చి తాళపత్రగ్రంథాలను పూర్తిచేశాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆ కారణంగానే పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట;” అని భాగవతాన్ని శ్రీరామునికి అంకితమిచ్చారని తెలుస్తోంది. 

జాంబవంతుడు ఒకేరాతిపై ఉన్న సీతారామలక్ష్మణ మూర్తులను ప్రాణప్రతిష్ఠ చేసినట్లు పురాణాలద్వారా అవగతమౌతోంది. పోతనామాత్యుని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయం వెలుపల వున్న జయవిజయులను దర్శించుకొని ఆ తర్వాత గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయానికి ముందున్న అంతరాలయంలో ఓ ప్రక్క శ్రీమన్నారాయణుడు, ఒక ప్రక్క ఆంజనేయస్వామి వారు దర్శనమిస్తారు. ఇంకోప్రక్క ఆళ్వార్ స్వాములు దర్శనమిస్తారు.
త్రేతాయుగంలో ఇక్కడ మృకండు మహాముని, శృంగి మహాముని యాగాలు, క్రతువులు చేస్తున్నప్పుడు రాక్షసులు వచ్చి ఆటంక పరుస్తుండగా ఈ దండకారణ్య ప్రాంతానికి రాముల వారు కోదండము, పిడిబాకు, అమ్ములపొదితో వచ్చారు కనుక కోదండరామ స్వామి అని అంటారు. అప్పటికింకా సీతాపహరణం జరుగలేదు. ఆంజనేయస్వామి కనపడకముందే రాముల వారు వచ్చారు కనుక అంజనేయుల వారు గర్భగుడిలో లేరు. ఇక్కడి స్వయంభూ విగ్రహాలను ద్వాపరయుగంలో జాంబవంతుడు ప్రతిష్ఠ చేసి పూజలు చేశాడని చెప్తారు. 

అయ్యలరాజు తిప్పరాజు, అయ్యలరాజు రామభద్రుడు, బమ్మెర పోతన, తాళ్ళపాక అన్నమాచార్యులు, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, ఉప్పుగుండూరు వేంకటకవి, ఈమాం బేగ్, మాల ఓబన్న వంటి ఎందఱో మహనీయులు స్వామివారి ఆశీస్సులు తీసుకొని తరించారని తెలుస్తోంది. 
భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న రామలింగేశ్వర స్వామిని చేరుకొని స్వామిని భక్తితో పూజిస్తారు. అనంతరం ఆలయం బయట స్వామి ఆలయానికి ఎదురుగా మాలఓబన్న మండపం భక్తులకు దర్శనమిస్తుంది. పూర్వం మాల ఓబన్న అనే భక్తుడు తన భక్తితో స్వామివారిని మెప్పించి ఆయన సాక్షాత్కారానికి పాత్రుడయ్యాడు అని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆతరువాత భక్తులు సమీపంలో ఉన్న సంజీవరాయుని మందిరానికి చేరుకుంటారు. అతిపురాతనమైన ఈ ఆలయంలో ఆంజనేయస్వామి వారు ముకుళిత హస్తుడై భక్తులకు దర్శనమిస్తారు. అలాగే స్వామి ఇక్కడ సంజీవరాయునిగా భక్తులచేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. సంజీవరాయుని దర్శించుకున్న భక్తులు అనంతరం సమీపంలో కొండపై ఉన్న వావిలి కొలను సుబ్బారావు మందిరానికి చేరుకుంటారు. శ్రీరామ భక్తుడైన సుబ్బారావు ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేసి శ్రీరామచంద్రుని కృపకు పాత్రులయ్యారని చెప్తారు. గర్భాలయంలో సుబ్బారావు శిలా ప్రతిమ ఒకటి భక్తులకు దర్శనమిస్తుంది.


No comments:

Post a Comment